Wednesday, February 14, 2007

శ్రీమద్రామాయణ కల్పవృక్షం - అవతారిక విశేషాలు

విశ్వనాథ సత్యనారాయణ



కాల్పనికోద్యమ ప్రభావంతో ప్రారంభమైన విశ్వనాథ సత్యనారాయణ సాహితీ కృషి అనతి కాలంలోనే ఆ ప్రభావాన్ని అధిగమించి ఆయన ఏర్పరచుకున్న విశిష్ట దృక్పథాన్ని ప్రతిబింబిస్తు వచ్చింది.ఆయన ప్రతిభ భావనాత్మకమే కాదు ఆలోచనాత్మకం కూడా.ఆపైన ఆధ్యాత్మిక దర్శనాశక్తి కూడా ఆ ప్రతిభలో కనిపిస్తుంది.


ఆధునిక యుగంలో జన్మించిన ఆమేయ ప్రతిభా సంపన్నుడైన సాహితీమూర్తి విశ్వనాథ సత్యనారాయణ.ఈయన 1895 సెప్టెంబర్ 10న జన్మించాడు.తండ్రి శోభనాద్రి,తల్లి పార్వతమ్మ.అది పద్యమైన ,గద్యమైన,మహాకావ్యమైన,ఖండకావ్యమైన,నవలైన,నాటకమైన తాను చే పట్టిన దానిని బంగారం చేయగల సహజసిద్ధ హస్తుడు విశ్వనాథ.సంప్రదాయం పునాదిపై వెలసిన నవ్యతా సౌంధం ఆయన సాహిత్యం. జ్ఞనపీఠ పురస్కారాన్ని పొందిన రామాయణ కల్పవృక్షమే దీనికి ప్రబల నిదర్శనం.


అనూచానంగ వస్తున్న కావ్యావతారిక సంప్రదాయాన్ని అక్షరాల పాటించి దానిని అపూర్వంగ,విలక్షణంగ తీర్చిదిద్దాడు రామాయణ కల్పవృక్షంలో.ఆంధ్రవాఙ్మయానికి ఆద్యమహాకవిగా పరిగణించబడుతున్న నన్నయ మొదలు ఆధునిక యుగం దాకా కావ్యాన్ని శ్రీకారంతో ప్రారంభించడం అనేది పరిపాటిగ వస్తుంది.విశ్వనాథ వారు సంప్రదాయవాది కావున ఆయన ఆ సంప్రదాయార్థముల మార్గాన పయనించి శ్రీకారంతో కావ్యాన్ని ప్రారంభించడం సమంజసంగా ఉంది.విశ్వనాథవారు ఒకచోట తాను అవిచ్ఛిన్న సంప్రదాయార్థిని అని చెప్పుకున్నాడు.ఆయనకు ఇలవేల్పు విశ్వేశ్వరుడు.ఎదవేల్పు శ్రీరాముడు.ఆ ఎదవేల్పును గూర్చిన ఈ మహా కావ్యాన్ని పరిపూర్ణంగా ఎరిగిన పరమేశ్వరుని ప్రార్థనతో వెలయించడం సముచితంగా ఉంది.ఇది ఆయనకే అంకితం.అవతారికలో సాధారణంగా ఉండే అంశాలైనటువంటి దైవస్తుతి,గురుస్తుతి,పూర్వకవిస్తుతి,కావ్యోత్పత్తి,ఆశ్రయదాత,వంశవర్ణన,మొదలైనవన్ని ఇందులో ఉన్నాయి.ఈ అవతారిక 1 నుండి 50 పద్యాల వరకు విస్తరించి ఉంది.


కృత్యాది పద్యం-దైవస్తుతి :


శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచు వానందవ
ల్లీ మంజుప్రసవంబు చిద్గగన ప్రాలేయాంశువున్ మోక్షల
క్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నీహార రుక్
శ్రీమంతంబయి పొల్చు వెల్గునొకడే సేవింతు విశ్వేశరా !

కావ్యాన్ని మంగళప్రదంగా శ్రీ కారంతో ప్రారంభిం చడం సంప్రదాయం.తాను సంప్రదాయవాది కాబట్టి శ్రీ కారంతో కావ్యాన్ని ఆరంభించి శివున్ని స్తుతించాడు. పంచభూతములు దివాకరుండును ...... అనే సీసపద్యంలో పరమ శివుని అష్టమూర్తిత్వాన్ని కీర్తించాడు.భూమి,నీరు,తేజం,వాయువు,ఆకాశం,సూర్యుడు,చంద్రుడు,యజ్ఞకర్త అనేవి ఎనిమిది శివుని రూపాలని ప్రతీతి."అంకితమిత్తు జానకిదేవి మనోహరుండు రఘుదేవుని సాధు కథా ప్రపంచమున్ "అని తన కృతి స్వీకర్త గురించి చెప్పారు.

కావ్య ప్రేరణ :

మనకు ఆదికావ్యం రామాయణం.ఇది అనేక భారతీయ భాషల్లోకి అనువదించబడింది.సర్వ భారతీయ భాషల్లో లెక్కకు మించిన అనేక రామాయణలు వచ్చాయి.తెలుగులో కూడా ద్విపద, చంపూ ,పద్య మొదలైన ఛందస్సుల్లో,వివిద ప్రక్రియల్లో రామాయణం వెలువడి వ్యాప్తిచెందింది.అలంటిది మళ్లీ రామాయణ రచన చేయవలసిన ఆవశ్యకత ఏముంది అనే సందేహం కలిగితే అది అసహజమేమి కాదని అన్నారు.

ఈ సందేహాన్ని నివృత్తి చేస్తు తను ఎందుకు మళ్లీ రామాయణ రచన రాస్తున్నారో వివరించాడు.అంతేకాకుండా కవి ప్రతిభను బట్టి,రచనా నైపుణ్యాన్ని బట్టి కథ ఒక్కటే అయినా రచనలో సారం కనిపిస్తుందని విశ్వనాథ వారి విశ్వాసం.ఎల్లపుడుకూడా రామనామం తన నాలుక కీర్తించునని,తన మనస్సు రామకథను రచించడానికి తొందరపడుతోందని,ఆ విశ్వాసాన్ని నడిపించే సారధి మాత్రం శివుడని కవి పేర్కోన్నాడు.

మరలనిదేల రామాయణంబన్నచో
నీప్రపంచక మెల్లనెల్ల వేళ
దినుచున్న యన్నమే దినుచున్న దిన్నాళ్ళు
తనరుచి బ్రతుకులు తనవిగాన
చేసిన సంసారమే సేయుచున్నది
తనదైన యనుభూతి తనదిగాన
తలచిన రామునే తలచెద నేనును
నాభక్తి రచనలు నావిగాన

కవి ప్రతిభలోన నుండును కావ్యగత శ
తాంశములయందు తొంబదియైనపాళ్ళు
ప్రాగ్వి పశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా దృతిని మించి

చిన్నప్పుడు తండ్రి.....

వ్రాసిన రామచందృకథ వ్రాసితివనిపించుకో వృథా
యాసముగాక కట్టుకతలైహికమా! పరమా యటంచు దా
జేసిన తండ్రియాజ్ఞయును జీవునివేదన రెండు నేకమై
నాసకలోహ వైభవ సనాథము నాథకథన్ రచించెదన్

తండ్రి ఆనతి,జీవుని వేదన రెండు ఏకమై ప్రేరేపించగా రామాయణ కల్పవృక్షం అవతరించిందని చెప్పుకున్నాడు.మళ్ళి రామాయణమేన అని అనుకునే వారికి ఎవరి అనుభూతి వారిదైనట్లుగా తన భక్తి రచనలు తనవి అని సమాధానం చెప్పాడు.ఇందులో కావ్య ప్రేరణ,కావ్యేతివృత్తం,కావ్యరచన అనే మూడు అంశాలు ఈ పద్యంలో వ్యక్తమైనాయి.

వంశ వర్ణన - తండ్రిదాన శీలత :

ప్రాచీనాంధ్ర కవులందరు తమ కావ్యాల్లో వారి వంశాన్ని గురించి చెప్పుకున్నారు.అలాగే విశ్వనాథ వారు కూడ తన సాహితీ ప్రస్థానానికి దోహదం చేసిన తండ్రిని,సోదరులను,గురువులను,మిత్రులను గురించి ఎంతో ఆత్మీయంగా స్మరించుకొంటు వారి పట్ల తన భక్తి ప్రపత్తులను తెలియజేశాడు. తండ్రి గురించి చెబుతు.....

ఆ నాతండ్రియనన్ దధీచి శిబి కర్ణాదుల్ పునారూప సం
స్థానం బందిన కర్మయోగి సితచంద్ర ప్రౌఢ కాంతిచ్ఛటా
స్నానం బాడిన స్వచ్ఛలింగమయునిన్ సాధించి మానందమూర్
లోనన్ నిల్పిన భక్తరాజు సుజనశ్లోకుండు దారుండొగిన్

అని తండ్రి దానశీలతలోదధీచి,శిబి,కర్ణాదులతో అభేదం చెప్పాడు.అలాగే తన తండ్రి పరమశివ భక్తాగ్రేసరుడని,చంద్రజ్యోత్స్నలో స్నానమాడి కాశిలోని శివలింగాన్ని తెప్పించి సొంత గ్రామమైన నందమూరులో ప్రతిష్టించాడని చెప్పాడు. నకనకలాడునట్టి గడుపులన్ వచ్చి త్రేచుచుబోయెడు తెరువరులను.... అంటూ సీసపద్యంలో తండ్రిగారి దాతృత్వాన్ని శ్లాఘించాడు.ఆకలితో నకనకలాడె కడుపుతో ఇంటికి వచ్చిన వారికి సంతృప్తిగా భోజనం పెట్టేవారని, చిరిగిన దుస్తులతో వచ్చిన వారికి నూతన వస్త్రాలిచ్చేవారని, బాధతో వచ్చినవారిని సంతోషంతో పంపేవారని అని తండ్రి దాన గుణాల్ని వర్ణించారు.అట్టి గొప్ప దానశీలత కలిగిన తండ్రికి తాను జన్మించడం గర్వంగా ఉందని చెప్పుకున్నారు.


తమ్ములు రామచంద్రునకు తమ్ములు యూహయెరింగి చేయగా
దమ్ములు ధర్మరాజునకు దమ్ములు చప్పినయట్టు చేయ నా
తమ్ములు నట్టిరందుజిన తమ్ముడు సన్మతి రామమూర్తి చి
త్తమ్మున నేను వానికొక దైవముగా గనిపింతు నెంతయున్

విశ్వనాథ వారికి గల ఇద్దరు తమ్ముల్లలో మొదటీ వారు వెంకటేశ్వరరావు,చిన్న తమ్మ్ముడు రామమూర్తి.
అన్నగారి ఊహతెలిసి ప్రవర్తించుటలో ఆ శ్రీరామచంద్రుని తమ్ముళ్ళలాగ,ధర్మరాజు మాట జవదాటని సోదరులు ఎట్లాగో తన తమ్ముళ్ళు అలాంటివారని చెప్పాడు.పెద్దవాడైన వెంకటేశ్వరరావు సంస్కృతాంధ్ర భాషల్లో దిట్ట.విశ్వనాథ వారి కవిత్వాన్ని చదివి బాగోగులు నిర్ణయించేవారట.అలాగే ఈయన లేఖకుడుగా కూడా ఉన్నాడు.చిన తమ్ముడైన రామమూర్తికి తానొక దైవము గా భాసింతునని చెప్పుకున్నారు.


తన ఎద ఎల్ల మెత్తన కృతప్రతి పద్యము నంతకంటె మె
త్తన తన శిష్యులన్న నెడదంగల ప్రేముడి చెప్పలేని మె
త్తన యయి శత్రుపర్వత శతారము సత్కవి చెళ్ళపిళ్ళ
వేంకన గురువంచు జెప్పికొనగా నది గొప్ప తెలుగు నాడునన్

విశ్వనాథ సత్యనారాయణగారు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి శిష్యులు.అవతారికలో తన గురువును గురించి నాలుగు పద్యాల్లో కీర్తించాడు. గురువును తలచుకుంటు వారి మనసు మెత్తనట! ప్రతి ప్ద్యం అంతకంటె మెత్తనిదట! అంతేకాకుండా ఆయన శిష్యులపై అపారమైన ప్రేమను కలిగి ఉంటాడని,కోపం వస్తే శత్రువులపై పిడుగులు కురిపిస్తాడట! అంతటీ వారిని గురువుగా చెప్పుకోవడం తెలుగు దేశంలో చాలా గొప్ప అని చెప్పుకున్నాడు.


అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగముస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్

అవతారికలో ఈ పద్యం చాలా ప్రసిద్ధమైంది. నన్నయకు,తిక్కనకు లేనటువంటి భోగము గురువర్యులైన చెళ్ళపిళ్ళ వారికి తన శిష్యరికం వల్ల కలిగిందని చెప్పుకున్నారు.వారికీర్తిని దేశమంతట వ్యాపించుటకు తన శిష్యరికమే కారణం అన్నాడు.ఇది మనకు అహంకారంగా కనిపిస్తుంది. అది ఆయన ఆత్మవిశ్వాసం మాత్రమే.


ఆతడె తోడు కల్గినను నచ్చముగా గలకండ లచ్చులుం
బోతలు పోసి యుండెదము పోతనగారి విధాన....

అంటూ కొడాలి ఆంజనేయులు గారితో పెనవేసుకున్న తన స్నేహబంధాన్ని గురించి మూడు పద్యాల్లో వివరించాడు.వీరిద్దరు కలిసి సత్యాంజనేయులు అనే పేరుతో జంట కవిత్వం రాశారు.



ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి
తిక్కన శిల్పపు తెనుగుతోట
యెర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు
పోతన తెలుగుల పుణ్యపేటి
శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని
కృష్ణరాయడనంత కృతి ప్రబంధ
పెద్దన వడపోత నిక్షురసంబు
రామకృష్ణుడు సురా రామగజము

ఒకడు నాచన సోమన్న;యుక్కివుండు
చెరిపి పదిసార్లు తిరిగ వ్రాసినను మొక్క
వోని యీ ఆంధ్రకవిలోక మూర్థన్యమణుల
మూద్గురు స్థానములుగ నమస్కరించి

నన్నయ మొదలుకొని నాచన సోమన వరకు గల తొమ్మండుగురు పూర్వాంధ్ర కవులను స్తుతించాడు.ఈ కవుల తరువాత పదవ స్థానం నాదే అనే విశ్వాసాన్ని ప్రకటించాడు.ఈ తొమ్మిది మంది కవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషనాన్ని చెప్పారు విశ్వనాథ వారు.

అంతకుముందు సంస్కృతంలో రామకథను రాసిన భాష్యకారులకు కూడా నమస్కరించాడు.
భాస కాళిదాస భవభూతి దిజ్ఞాగు
లకు ప్రశస్త వాగ్వి లక్షణుడు ము
రారి భట్టునకు రామకథా భాష్య
కారులకును మోడ్పుకై ఘటించి

ఈ భాష్య కారులందరు రామకథను గ్రహించి నాటకాలను,కావ్యాలను రచించారు. కావున వారందరికి నమస్కరించి నేను కూడా వారిలా రామాయణాన్ని తన అనుభూతిని మేళవించి రచిస్తానని చెప్పుకొన్నాడు. ఈ సంసారమిదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భా... అంటు విశ్వనాథ వారు ఎన్ని జన్మలెత్తిన ముని వాల్మీకి ఋణం తీర్చుకోగలమా ? అంటాడు.

ఒక్కవాల్మీకి కాక వేరొక్కడెవడు
సుకవిశబ్ద వాచ్యుండిక గుకవినింద
యప్రశస్త పథంబుగానవుట జేసి
ముని ఋణంబు దీర్ప నీ కావ్యామును రచింతు

అని కుకవినిందలో ముని ఋణం తీర్చటానికి ప్రయత్నిస్తున్నానంటాడు.

నేను మనస్సన్యాసిని
నేనిది యిమ్మంచునడుగ నెవ్వరి నెపుడున్
దానేది యేనియు బ్రాప్త
మ్మైనన్ వలదంచు జెప్ప నంతియగాకన్

అని తన గురించి కూడా చెప్పుకన్నాడు. విశ్వనాథ వారి విశాలహృదయానికి ఈ పద్యం నిదర్శనంగా నిలుస్తుంది. స్వయం ప్రతిభతో శ్రీమద్రామయణ కల్పవృక్ష అవతారికను అద్భుతంగా తీర్చిదిద్దారు విశ్వనాథ సత్యనారాయణ గారు.



సంప్రదింపు గ్రంథాలు :

శ్రీమద్రామయణ కల్పవృక్ష అవతారిక పద్యాలు :

జ్ఞానపీఠ విశ్వనాథ శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్య వైభవం : (సంకలనం) కోటి సూర్యనారాయణమూర్తి.


3 comments:

రాధిక said...

mamci post.caalaa vishayaalu telusukunnaanu

మంజుల said...

తెలుగు సాహిత్యం మీద అభిమానం ఉండి చదవలేకపోయిన వాళ్ళకి చాలా ఉపయోగం మీ బ్లాగ్. వీలైతే విశ్వనాధ వారి రచనలు గురించి ఇంకా కొన్ని పోస్ట్ లు రాయగలరు.

Sriram said...

mI prayatnaniki naa abhinandanalu. marinni ilaaMTivi pracuriMcaMDi...