Monday, February 19, 2007

నన్నయకు పూర్వం - తెలుగు భాష సాహిత్యం

సాహిత్యం అనే మాటను మనం సర్వసాధారణంగా లిపిబద్ధమై గ్రంథ రూపంలో ఉన్న సాహిత్యానికి మారుగా వాడుతుంటాం.కాని అదొక్కటే సాహిత్యం కాదని లిపి బద్దం కాని మరొక రకమైన సాహిత్యం పల్లె ప్రజల మధ్య ఉందని అదే మౌఖికసాహిత్యం అని మనం నేడు గుర్తిస్తున్నాం.

పూర్వదశ క్రీ.పూ.201-క్రీ.శ.1000 ఈ కాలంలో తెలుగు భాష జనవ్యవహారంలో ఉందనటానికి ఆధారాలున్నాయి.

1. ఈ దశలో లభిస్తున్న సంస్కృత,ప్రాకృత శాసనాల్లోని తెలుగు మాటలు.
2.గాథాసప్తశతిలోని తెలుగు మాటలు,పాటలు,పేర్లు.
3.జనవ్యవహారంలోని జానపదగేయరూప కవిత్వం.

ఈ ఆధారాల వల్ల క్రీ.పూ.201-క్రీ.శ.1000 కాలంలో తెలుగు ప్రజల పలుకుబడిలో ఉందని చెప్పవచ్చు.

విద్వద్భాష - సంస్కృతం
రాజభాష - ప్రాకృతం
దేశభాష - తెలుగు
గా ఈ మూడు భాషలు చెలామణిలో ఉండేవి.
ఈ పరిస్థితుల్లో విద్యావంతులు సంస్కృత,ప్రాకృతాలనే గ్రంథ రచనకు వినియోగించి ఉంటారు.పైగా జైన,భౌద్ద మతాల ప్రాభల్యం సాంస్కృతిక రంగంలో ఉండటం వల్ల వాటి ఆటుపోట్లు సాహిత్యం మీదపడి ఉంటాయి.కావున ఈ కాలంలో తెలుగు సాహిత్యం / కవిత్వం అంతగా అభివృద్ధి చెందక కేవలం శాసనాలకు మాత్రమే పరిమితమైందని తెలుస్తుంది.
ఈ విధంగా రాజులు వేయించిన తెలుగు శాసనాలలో ఒకవైపు వాడుక భాష,మరోవైపు పద్యరచనకనువైన విద్యావంతుల కావ్యభాష రూపొందాయని మనం గ్రహించవచ్చు. క్రీ.శ.11వ శతాబ్దానికి పూర్వం తెలుగు భాషలో రచించబడ్డ గ్రంథాలు మనకు నేడు లభ్యం కాలేవు.(నన్నయ భారతం తప్ప) ఉన్నవని చెప్పటానికి ఆధారాలు కూడా లేవు.
ఆంధ్రదేశాన్ని వివిధ రాజవంశాలు పాలించాయని మనకు తెలుసు అందులో మొదటి వారు ఆంధ్రశాతవాహనులు వీరి కాలం క్రీ.పూ.230-225 ఆ తరువాత వరుసగా
ఇక్ష్వాకులు - క్రీ.శ.225-306
బృహత్పలాయనులు - క్రీ.శ.270-288
ఆనందగోత్రికులు - క్రీ.శ.4వ శతాబ్దం
శాలంకాయనులు - క్రీ.శ.300-420
విష్ణుకుండినులు -క్రీ.శ.420-626
అయితే వీరు వేయించిన శాసనాలన్ని సంస్కృత, ప్రాకృత భాషలలోఉన్నాయి.ఈశాసనాల్లోఅక్కడక్కడ కొన్ని తెలుగు పేర్లు మాత్రం కనిపిస్తాయి.
ప్రాథమిక యుగం : క్రీ.పూ.200-600 ఈ మధ్య కాలంలో తెలుగును వ్యవహరించే జన సామాన్యం ఎట్లాంటిరచనల్లో తమ హావభావాల్ని వ్యక్తపరుస్తు రసానుభూతిని పొందేదో ఊహించవలసి ఉంది.అలా చేస్తే ఏ భాషలో అయిన కవితా పరిణామంలో గేయమే ప్రథమదశ అని ప్రాథమికమైన గేయంలోనే కవిత్వ బీజాలుంటాయని తలచడంవల్ల తెలుగులో కూడా ప్రాచీన కాలంలోనే గేయ కవిత్వం ప్రజల నోళ్ళలో వెలసి ఉంటుందని ఊహించవచ్చు ఆ పాటలు,గేయాలు ఆయా జాతి జనుల ఉత్సవాలలోను,వివాహాది మొదలైన శుభకార్యాలలోను పాడుతు ఉంటారు.

శాసనకవుల వలె పండితులు కాక సామాన్య జనానికి ప్రీతికలిగించే పాండిత్య నిరపేక్షకాలైన పాటలు,పదాలు మొదలైనవి రచించిన వారు నన్నయకు ముందు కొందరుండేవారని చెప్పటానికి ఆధారాలున్నాయి.

1.నన్నయ (క్రీ.శ1053) భారతంలో ఆకాలంలో వ్యాప్తిలో ఉన్న నాగగీతములు అనే రాగయుక్త గేయాలను అభినయంతో (డ్యాన్స్ )కూడిన అంతు లను పేర్కొన్నాడు.
2.మల్లికార్జున పండితారాధ్యుడు శంకర గీత భాస్వత్పదావళీ,ఆనందగీతంబులు అనే పదాలనే కాక ప్రాక్తాన నూతన భావ గీతాలచే శివుని పొగిడెనని పాల్కూరికి సోమనాథుడు పేర్కొన్నాడు.
3.పాల్కూరికి సోమనాథుడు (1060-1240) తన పండితారాధ్య చరిత్రలో తుమ్మెద,శంకర,నివాళి,ప్రభాత, వాలేశు, గొబ్బి, వెన్నెల, సంజవర్ణన,గణవర్ణన మొదలైన పదాలు పాడుతు పండితుని శిష్యులు వెలనాటి చోడుని సభకు వెళ్ళారని,అలాగే శివరాత్రి జాగరణ సమయంలో వేడుకలను వర్ణిస్తు దేశీమార్గానికి చెందిన నాటక ప్రదర్శనలను, ఆటలను,పాటలను సూచించాడు. బహుళ ప్రచారంలో ఉన్న ఈ గీతాలు,పాటలు,పదాలు అతని కాలంలో పుట్టినవే కాకుండా అంతకు పూర్వం నుంచే జనవ్యవహారంలో ఉండేవని చెప్పవచ్చు.

గాథాసప్తశతిలో పాటల ప్రసక్తి: తెలుగులో శాతవాహనుల కాలం నుండి పాటలు ఉన్నాయి.హాలుడు(క్రీ.శ19-247) గాథాసప్తశతిలో సహజ దేశీయమైన తెలుగు పాటల ప్రసక్తి కొన్ని చోట్ల కనిపిస్తుంది.
చక్కగా దంచిన సన్నబియ్యపు వన్నులాంటి వెన్నెల,తాను కోరుకున్నదానికన్న కొల్లాగా పండిన పైరును పల్లెరైతు చూచి ఆనందంతో ఇచ్ఛవచ్చినట్లు పాడుకొన్నాడు అని గాథాసప్తశతి 789వ గాథలో ఉంది.
742వ గాథలో పెళ్ళి కూతురికి పెళ్ళి కడియాలు తొడిగించి పుణ్యస్త్రీలు మంగళగీతాలు పాడుకొన్నారు ఆ పాటల్లో కాబోయె మొగుని పేరు,అతని వంశం పేరు వర్ణిస్తు ఉంటే వింటున్న పెళ్ళి కూతురికి ఒళ్ళు పులకరించేదట.
ఒక విరహిని తనకు దూరమైన ప్రియున్ని తలచుకుంటు దుఃఖంతో పాటు పాడిన ఎడబాటు పాట ప్రసక్తి కూడా ఉంది.

అయితే ఈ పాత గేయాలు,పాటలను ఆదిలో ఎవరు జాగ్రత్త చేయలేదు.చేసివుంటే మనకు కూడా అతి ప్రాచీనమైన సాహిత్యం ఉండేదని సగర్వంగా చెప్పుకొని ఉండేవాళ్ళం. తమిళంలో క్రీ.శ. 4వ శతాబ్దంలో ప్రాచీన గేయాలను సేకరించి,వాటిని సక్రమమైన సంకలన గ్రంథాలుగా వేయించాలని,అందుబాటులో ఉండే గ్రంథాలుగా రూపొందించాలని నాటి తమిళ రాజులు గుర్తించారు. నిట్టుత్తొగై, పత్తుప్పాటు మొదలైన గేయ సంకలనాలు ఇట్లు వెలువడ్డ గ్రంథాలే .క్రీ.శ. 1వ శతాబ్దిలోనే హాలుడు ఆంధ్రదేశంలో ప్రాకృత గాథలను సేకరించాడు.అప్పటి తెలుగు పాటలను ఎవరు (రాజులు) సంకలనం చేయలేదు అలా చేసి ఉంటే తమిళ భాషలోలాగే మన తెలుగు భాషలో కూడా శాతవాహనుల కాలం నుండే పాటలు దొరికి ఉండేవి.

తెలుగు కవిత ఆరంభస్థితి : తెలుగు కవిత్వ ఆరంభస్థితి మూడు రకాలుగా ఉంది.ఇది క్రీ.శ.600 నుండి ఆరంభమై క్రీ.శ.1000 వరకు కొనసాగింది.
1.శాసన కవిత్వం.
2.పదగేయరూప కవిత్వం.
3.కావ్యరూప కవిత్వం.

1.శాసన కవిత్వం : ఇది తెలుగు కవిత్వ ఆరంభస్థితిగా చెప్పవచ్చు. ఈకాలంలో రేనాటి చోళులు,తూర్పు చాళుక్యులు,బాణులు,వైదుంబులు,పశ్చిమ చాళుక్యులు మొదలైన రాజులు తెలుగు భాషలో శాసనాలు వేయించారు.క్రీ.శ.6,7,8 శతాబ్దాలలో తెలుగులో ఉన్నవి గద్యమయ శాసనాలు మాత్రమే.
1.ఇప్పటి వరకు లభించిన మొట్టమొదటి శాసనం రేనాటి చోళుల 33 గద్యమయశాసనాలలో ధనుంజయుని కలమళ్ళ శాసనం మొదటిది .ఇది క్రీ.శ .575 కాలం నాటిది
.క్రీ.శ.610 లో పొట్లదుర్తి మాలెపాడు శాసనం.ఈ గద్యమయశాసనాలు గణబద్ధం కావు . కాబట్టి వాటిని కావ్య వాఙ్మయం అనలేదు.సలక్షణమైన ఛందోబద్దశాసనాలు మనకు తూర్పు చాళుక్య రాజైన గుణగ విజయాదిత్యుని కాలం (848-892) నుండి కంపిస్తాయి.
1. గుణగవిజయాదిత్యుని సేనాని,ఆజ్ఞప్తి అయిన పండరంగని అద్దంకి శాసనం క్రీ.శ.848 ఈనాటికి లభించిన పద్యమయ శాసనాలలో మొదటిది.ఇది పద్దతిలో(పద్య,గద్య) ఉంది.దేశీ ఛందస్సుకు చెందిన తరువోజ పద్యం తరువాత నాలుగు పంక్తుల్లో గద్యం ఉంది. దీనిని బట్టి గుణగవిజయాదిత్యుడే ఆంధ్రభాషాపోషకులలోఆద్యుడని చెప్పవచ్చు.
2. అద్దంకి శాసనంలో ప్రస్తుతించబడిన పండరంగడే గుణగవిజయాదిత్యుని కందుకూరు శాసణం (848) లో కూడా వర్ణితుడు.ఈందులో పద్యం చివర లోపించిన సీసపద్య లక్షణం దాని కింద తేటగీతి ఉన్నట్లు భావిస్తున్నారు.
3. క్రీ.శ.897 నాటి చాళుక్య భీమరాజు ధర్మవరం శాసనంలో పద్యం మొదట కొంత లోపించిన సీసపద్యం స్పష్టంగా కనిపిస్తుంది.ఈ పద్యం చివర ఆటవెలది పద్యం ఉంది.
4. దీని తరువాత లభిస్తున్న శాసనం యుద్ధమల్లుని బెజవాడ శాసణం.ఇది ఒకే శాసనం కాదని తాత,మనుమలు ఇద్దరు యుద్ధమల్లులు రాయించిన రెండు శాసణాలని పరిశోధకుల నిర్ణయం.మొదటియుద్ధమల్లుడు క్రీ.శ.885 ప్రాంతంలో రెండవయుడ్ధమల్లుడు క్రీ.శ.930 ప్రాంతలలోను రాయించి ఉంటారని నిర్ణయించారు. మొదటి శాసనంలో నాలుగు మధ్యాక్కరలు,తర్వాత ఫలశ్రుతి ఏడు పంక్తులలో ఉంది.రెండవ శాసనంలో ఒక మధ్యాక్కర,తర్వాత నాలుగు గణాలపై ఒక అక్షరం చెక్కబడింది.ఈ శాసనాన్ని శ్రీపతి పండితుడు రచించినట్లు తెలుస్తుంది.
5. రెండవ యుద్ధమల్లుని కూమారుడైన మహారాజు క్రీ.శ.980 ప్రాంతంలో వేయించిన అరుంబాక సంస్కృత తామ్ర శాసనంలో యతి,ప్రాస లక్షణాలతో తెలుగు కంద పద్యం కనిపిస్తుంది.క్రీ.శ.848కి చెందిన సాతలూరు శాసనం లో ఒక చంపకమాల వృత్తం ఉంది.ఈ శాసనానికి ఆజ్ఞాప్తిగా ఉన్న పండరంగడే దీన్ని రచించి ఉంటాడని నిడదవోలు వెంకట్రావు గారు ఊహించారు.ఇదే నిజమైతె పండరంగడు సేనానే కాక తెలుగు,సంస్కృత భాషలలో కవి అయి,సంస్కృత వృత్తాలను తెలుగులోకి తేవడానికి అతడే మార్గదర్శకుడు అని చెప్పవచ్చు.
6. క్రీ.శ. 1000 నాటిదని భావించే విరియాల కామసాని గూడూరు శాసనంలో 3చంపకమాల,2ఉత్పలమాల వృత్తాలున్నాయి.పైన పేర్కొన్న ఈ పద్య,గద్యమయ శాసనాలను బట్టి,భాషాఛందోరీతులను బట్టి నన్నయకు పూర్వం తెలుగులో గ్రంథ రచన జరిగి ఉంటుందని చెప్పవచ్చు కాని అవి ఏవికూడా నేటికిని లభ్యం కాలేదు కావున నన్నయ భారతమే మొదటి రచనగా పరిగణించబడుతుంది.

2.పదగేయరూప కవిత్వం : నన్నయకు పూర్వం శాసనబద్దమైన కవిత్వమే కాక పదగేయరూపమైన దేశీ కవిత్వం కూడా ప్రబలి ఉన్నట్లు తెలిస్తుంది.ఈ దేశీయ రచనలు రెండు రకాలు.
1. పదాలు : తుమ్మెద,ప్రభాత,గొబ్బి,నివాళి మొదలైనవి పదాలు.
2. పా టలు : లాలి,జోల,ఏల,ఊయల మొదలైనవి పాటలు.
ఈ పాటలు ఏకపద,ద్విపద,త్రిపద,చతుష్పదాలుగా జనసామాన్యాంలో వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది.చాళుక్య రాజులు తెలుగు దేశంలో దేశి కవితను నెలకొల్పి ఆ కవితకు అపారమైన ప్రోత్సాహమిచ్చినట్లు నన్నెచోడుడు తన కుమార సంభవంలో పేర్కొన్నాడు. మార్గ, దేశి పదాలను వాడివ మొదటి కవి ఈయన.
మునుమార్గ కవిత లోకం
బున వెలయగ దేశి కవిత బుట్టించి తెలుం
గున నిలిపిరంధ్ర విషయం
బున జనచాళుక్యరాజు మొదలుగ పలువుర్
పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర అవతారికలో ద్విపదను గురించి చెబుతు అనియతగణైః , ప్రాసోవా ,యతిర్వా అని సంస్కృతోక్తులను మూడింటిని ఉదాహరించాడు.ఇవి తెలుగు భాషకు సంబంధించిన ఛందస్సుత్రాలే.
నన్నయకు ముందున్న కవిత్వాన్నిరెండు రకాలుగా విభజించడానికి వీలుంది.
1. సామాన్య జనవ్యవహారంలోని పద,గేయరూప కవిత్వం.దీనినే దేశిపద కవిత్వం అంటారు.
2. కొందరు పండితులు సంస్కృతాన్ని వీడలేక,దేశి రచనలను కాదనలేక మణి ప్రవాళశైలిని సృష్టించి రచనలు చేశారు.ఈ రీతి 7వ శాతాబ్ది నుండి శాసనాల్లో అక్కడక్కడ కనిపిస్తుంది.

3. శాసన కవిత్వం: నన్నయకు పూర్వం కొందరు కవులున్నట్లు వారు కావ్యాలు రచించినట్లు తెలుస్తుంది. వేటూరి ప్రభాకరశాస్త్రి సంపాదితమైన ప్రబంధ రత్నావళి లో పద్మకవి జినేంద్ర పురాణం నుండి ఒక సీసపద్యం, సర్వదేవుని ఆదిపురాణం నుండి ఒక సీసపద్యం ఉదహరించాడు.
కన్నడ త్రయం (పంపడు,రన్నడు,పొన్నడు) లోని పంపకవే-పద్మకవి అని,పొన్నకవే సర్వదేవుడని నిడదవోలు వెంకట్రావు గారు పేర్కొన్నారు.అలాగే మడికి సింగన (1420) సకలనీతిసమ్మతం అనే సంకలన గ్రంథంలో గజాంకుశుడనే కవిని పేర్కొన్నాడు.గజాంకుశుడనేది బిరుదని అది సహజ నామం కాదని అతని పేరు నారాయణుడని రాష్ట్రకూట రాజైన మూడవ కృష్ణ చక్రవర్తి (939-965)వద్ద మంత్రిగా ఉన్నాడని వెంకట్రావు గారు తెల్పారు.ఇది నిజమని నమ్మితే నన్నయకు ముందు తెలుగులో కవిత్వం చెప్పాడని నిర్ణయించవచ్చు.కాని ఈయన రాసిన గ్రంథాలేవి లభించలేవు.
నన్నయకు ముందున్న శాసన కవులు శ్రీపతి పండితుడు (898),అయ్యనభట్టు (973-990).

ఈ విధంగా నన్నయకు పూర్వమే తెలుగు భాషలో కవిత్వం విలసిల్లిందని చెప్పటానికి ఆధారాలున్నా అంతకుముందున్న గ్రంథాలేవి కూడా నిర్దుష్టంగా మనకు లభించలేవు కావున నన్నయ భారతాన్నే మనం తెలుగు భాషకి ఆది గ్రంథంగా భావిస్తున్నాం.అంతకుముందు తెలుగు కవిత్వం,భాష లేకపోయినట్లైతే నన్నయ అంత పెద్ద మహా గ్రంథాన్ని ఒక్కసారిగా తెలుగు భాషలో సృష్టించాడానికి (రాయడానికి) వీలుండేదికాదు.దీన్ని బట్టి మనం నన్నయకు పూర్వం తెలుగు భాష జనుల వ్యవహారంలోను,గేయాల రూపంలోను,శాసనాల్లో కవిత్వ రూపంలో ఉందని గ్రహించవచ్చు.
ఆధార గ్రంథాలు :
తెలుగు సాహిత్య సమీక్ష : జి.నాగయ్య
తెలుగు భాషా సాహత్య సంస్కృతి చరిత్ర : అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యలయం

5 comments:

శ్రీనివాస said...

నా/మన తెలుగు భాషకు ఇంత పూర్వ చరిత్ర ఉన్నదని చదువుతుంటే నిజంగా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయండీ.

- శ్రీనివాసరాజు దాట్ల
- http://blog.harivillu.org

sarath said...

భీమనాతి గారూ మీ వ్యాసం చాలా ఆసక్తిదాయకంగా ఉన్నది.ఇటువంటి మరిన్ని పరిశోధనాత్మకమైన వ్యాసాలను అందించగలరని ఎదురుచూస్తున్నాను.

rksistu said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

GARAM CHAI said...

బాగా చెప్పారు సార్...

తెలుగు వారి కోసం సరికొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడినది
చూసి ఆనందించండి తెలుగు న్యూస్ మూవీ న్యూస్ ... వీక్షించండి ఆశీర్వదించండి

https://www.youtube.com/garamchai

Unknown said...

nice poetry
https://www.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
plz watch our channel.