Tuesday, January 30, 2007

దాశరథి కృష్ణమాచార్యులు

భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా సాగుతున్న కాలంలోనే,తెలంగాణలో కూడా నిజాం వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది.ఈ ఉద్యమాలలో ఎందరో నాయకులు,మేధావులు,ప్రతిభావంతులు తమ ఉపన్యాసాల ద్వారా,వ్యాసకర్తలు తమ వ్యాసాల ద్వారా,కవులు తమ కవిత్వం ద్వారా ప్రజల్లో జాతీయాభిమానాన్ని, ప్రాంతీయాభిమానాన్ని పెంపొందించడానికి కృషి చేసారు.ఇలా చేసిన వారిని ప్రభుత్వం బంధించి చాలా రకాలుగా హింసించేది.అయినా కాని వారు తమ కార్యకలాపాలను కొనసాగించారు.పరాయి పాలనలో ప్రజలు చాలా కష్టాలను,బాధలను అనుభవించేవారు.ఎంతో మంది నాయకుల త్యాగాల ఫలితంగా 1947లో భారతావనికి స్వాతంత్ర్యం సిద్దించింది.కాని తెలంగాణకు మాత్రం నిజాం నవాబుల పాలన నుంచి విముక్తి లభించలేదు.నిజాం పాలనలో ప్రజలు దుర్భర జీవితాలను గడిపే వారు.


నిజాం నిరంకుశ పరిపాలనలో ప్రజలకు ఎలంటి స్వేచ్ఛఉండేది కాదు.ప్రజలు తమ మనసులోని కోర్కేలను తెలుపుకొనుటకు గాని,సభలు ఏర్పాటుచేసి తమ కష్టాలను,బాధలను చేప్పుకోవడానికి వీలుండెది కాదు.ప్రజలపై అధికపన్నులు విధించడం,వారి భూములను లాక్కోవడం,వారిని నానా రకాలుగా బాధించే వారు.రజాకార్లు ప్రజల పాలిట నరభక్షకుల్ల తయారయ్యారు.వీరు ఇండ్లపై పడి ప్రజల్ని ఊచకోతకోసేవారు.ఆడవారిని ఎత్తుకెల్లి మానభంగం చేసెవారు.ఈ విధంగా తెలంగాణ ప్రజలు నిజాం నవాబుల పరిపాలనలో స్వేచ్ఛా,స్వాతంత్ర్యాలు లేకుండా జీవచ్చవాల్లా బ్రతికేవారు. ఇలా వీరి మతోన్మాద,కిరాతక,నియంతృత్వ,నిరంకుశ పాలనను ఎదిరించి నిజాం నవాబుకు సింహస్వప్నమై నిలిచి...

నా పేరు ప్రజాకోటి
నా ఊరు ప్రజావాటి.... అంటు తెలంగాణ ప్రజల హృదయతంత్రులను మీటి ,వారిని జాగృతం చేసిన ప్రళయకవితామూర్తి అతడే దాశరథి కృష్ణమాచార్యులు.

దాశరథి కృష్ణమాచార్యులు గారు 1925 జులై 22న వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా గూడూరు గ్రామంలో గీర్వాణ కుటుంబంలో జన్మించాడు.అందరిల కాకుండా వీరికి కవిత్వం పుట్టుకతోనే వచ్చిన సంస్కారం.దాశరథికి తెలుగు దేశమన్న,తెలంగాణ అన్న ప్రత్యేకమైన అభిమానం ఉండేది.దేశభక్తిపూరిత రచనలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి.ఆయన కవిత్వంలో భావావేశం ఉంటుంది.

దాశరథి గారికి తెలుగుదేశమన్న,తెలంగాణమన్న ఒడలు ఉప్పొంగి ఉత్కంటతో,భావావేశంతో కవిత్వం చెప్పేవాడు.ఆ భావావేశంతోనే దేశభక్తిపూరిత రచనలతో నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా గొంతెత్తి...
ఓ నిజాము పిశాచమా కానరాడు
నిన్నుబోలినరాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాలవీణ అని ఎలుగెత్తి సభలలో వినిపించాడు.


తెలుగు కవిత్వానికి దాశరథి చేసిన సేవ అపూర్వం.ఈయన రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం, నవమి, నవమంజరి, అభినవ దాశరథీశతకం, తిమిరంలో సమరం, ఆలోచనాలోచనలు, మహాబోధి, జ్వాలాలేఖిని, సాఖీనామా, గాలిబ్ గీతాలు, మొదలైనవి దాశరథి తెలుగు కవిత్వానికందించిన అపురూప రచనలు.


దాశరథి రచనావ్యాసంగానికి గుర్తింపుగా పలు సంస్థలు, యూనివర్సిటీలు ఆయనను ఘనంగా సత్కరించాయి.1965లో ఈయన రాసిన గాలిబ్ గీతాలకు ఆంధ్రప్రదేశ్ ఉత్తమ అనువాద బహుమతి,1967లో కవితా పుష్పకం దీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు,1974లో తిమిరంలో సమరం కు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులు వచ్చాయి.ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతోను,ఆగ్రా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదుతోను సత్కరించాయి.15-08-1977 నుండి కొద్ది కాలం పాటు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేసాడు.

ఆయన రచనల్లో ఉద్యమ ప్రభావాన్ని ప్రస్ఫుటం చేస్తూ రచించిన కవితలు అగ్నిధార, రుద్రవీణ. వీటిల్లో తెలంగాణ ఉద్యమ ప్రభావం,నిజాం రాజుల ఆకృత్యాలు మనకు విశేషంగా కనిపిస్తాయి.దాశరథి కవిత్వం ఎంత భావస్ఫోరకంగా,అర్థవంతంగా ఉంటుందో ఈ పద్యం ద్వారా గమనించవచ్చు.

నిజాం నిరంకుశత్యాన్ని,ఆగడాలను ఖండిస్తు.....


అదె తెలంగాణలోన దావాగ్ని లేచి

చుట్టుముట్టిన భయద సంక్షోభ వేళ

అది నిజాము నృపాలుని అండదండ

చూచుకొని నిక్కినట్టి పిశాచహేల


నాడు మానవతీ నయనమ్ములందు
నాగ సర్పాలు బుసకొట్టి నాత్యమాడె
నాడు మానవతయు నవనాగరకత
తన్నులెన్నది రాక్షసర్వమ్ముచేత

అంటు ఈ పద్యంలో నాడు మానవతీ నయనమ్ములందు, నాగ సర్పాలు బుసకొట్టి నాట్యమాడె" అన్నాడు.నిజాం అనుచరుల అత్యాచారాలకు బలైన స్త్రీలు తీవ్రమైన కక్షతో అక్షుల్ని (కన్నుల్ని)కలిగి ఉన్నారు.సర్పాలలో నాగుపాము కక్షా తత్వానికి పరాకాష్ఠ.అందుకే అతివల నయనాల్లోని ,కక్షా తత్వమంతా నాగసర్పాలుగా బుసకొడుతున్నదని,స్త్రీల హృదయాల్లోని ఉద్విగ్నబాధను కవి పై పంక్తుల్లో వివరించాడు.


ఈ విధంగా నిజాం నవాబుల ఆకృత్యాలను,ఆగడాలను,నిరంకుశత్యాన్ని,మతోన్మాదాన్ని,కిరాతకాలను స్వయంగా చూసి,అనుభవించి,తెలంగాణ ఉద్యమంలోకి దూకి నిజాం పరిపాలనపట్ల ప్రజల్లో విముఖత కలిగించేఅందుకు సాహిత్యాన్ని ఆయుధంగా ధరించాడు.ఈ కృషిలో భాగంగా నిజాం ప్రభుత్యం నుంచి నిర్భంధాన్ని,చిత్రహింసలను అనుభవించారు.అయిన కూడా ఏమాత్రం చెలించకుండా తన కవిత్వం ద్వారా తెలంగాణ ప్రజల్ని జాగృతం చేసాడు.

ఆయన నిజామాబాదు జైల్లో ఉన్న కాలంలోనే ఓ నిజాము పిశాచమా.... అనే పద్యాన్ని జైలు గోడలపై రాసాడు.దీన్నిబట్టి ఆయన ఎక్కడ ఉన్న భయపడకుండా,ఏమాత్రం వెరవకుండా తన రచనల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి,నిజాం ప్రభువుల గుందెల్లో నిద్రపోయాడు. 13-09-1948లో పోలీసు చర్య అనంతరం తెలంగాణాకు నిజాం ప్రభువుల పాలన నుంచి విముక్తి లభించింది.దాశరథి (ప్రజల) దీక్ష ఫలించింది. దాశరథి తన కవితాదారకు పోతన్న నుంచి కొన్ని ఒడుపులు గ్రహించానని చెప్పుకున్న నిగర్వి, నిరాడంబరుడు,స్నేహశీలి, మృధుస్వభావి. తన అభిమాన కవిగా పోతన్నను గురించి చెప్తు....

నేను పోతన కవిశాను గంటములోని
ఒడుపుల కొన్నింటి బడసినాను...
... అని సగర్వంగా చెప్పుకున్నాడు.కలాన్ని,హలాన్ని సమానంగా నడిపించిన పోతన్ననే తన అభిమానిగ ఎన్నుకొన్న దాశరథి అభిరుచి ఆయన అభ్యుదయ,ఉద్యమ ధోరణిని మరింత బలపరుస్తుంది.


నా జీవితమే పోరాటం.ఎన్నోప్రతీపశక్తులతో పోరాడాను. పోరాడుతున్నాను.పోరాడగలను.నేను ఆశావాదిని.దురాశావాదులు నిరాశపడతారు.ఆశావాదికి నిరాశలేదు.వినయంతో నాదారిన నేను పయనిస్తాను.నా గమ్యం ప్రపంచ శాంతి,నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం.

జనం మనం
మనం జనం
జనం లేక
మనం లేము
అని చెప్పిన దాశరథి జనం తానుగ,తాను జనంగా బ్రతికాడు.

No comments: