Monday, January 22, 2007

ప్రాచీన భారతీయ ఆలంకారికులు

భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ సాహిత్యంలో కూడా కావ్యలక్షణాలను కూలంకషంగ ఆవిష్కరించి, వ్యాఖ్యానించి, విమర్శించిన ఘనత భారతీయులదే.భరతుడు మొదలుకొని జగన్నాథ పండితరాయల వరకూ కావ్య లక్షణాల లోతును తరచి చూచిన ఆలంకారికులు ఎందరో ఉన్నారు.తెలుగులో వెలువడ్డ స్వతంత్ర అలంకార శాస్త్రాలు తక్కువ. అవి కూడ సంస్కృత అలంకారశాస్త్ర గ్రంథాలకు అనుకరణాలే. అయితే తెలుగులో సంస్కృత అలంకారశాస్త్ర గ్రంథాలకు వ్యాఖ్యానాలు, అనువాదాలు మాత్రం చాలా వెలువడ్డాయి.

భాషా లక్షణాలను వ్యాకరణ శాస్త్రం నిరూపించినట్లు కావ్య లక్షణాలను ఈ అలంకారశాస్త్రాలు నిరూపిస్తాయి.

అలంకార శబ్దానికి సౌందర్యం అన్న అర్థం కూడా ఉంది. ఈ దృష్ట్యా దీనిని కావ్య సౌందర్య శాస్త్రం , సాహిత్య సౌందర్య శాస్త్రం అని కూడా అనవచ్చు.

ఈ ఆలంకారికులందరు కూడా తమకు పూర్వం, సమకాలంలోను వచ్చిన వివిధ కావ్యాలను, కావ్యశాస్త్ర గ్రంథాలను గాఢంగా పర్యాలోచించారు.ఆ పర్యాలోచనంలోను, అనుభవంలోను నిష్పన్నమైన ఫలితాలను కావ్య లక్షణాలుగా నిరూపించారు.అంతే గాని వీరు ప్రత్యేకంగా కావ్య లక్షణాలను, లక్ష్యాలను వివేచించినవారు కాదు. ఎందుకంటే కావ్యాలు సృజనాత్మక కళారూపాలు. వాటిని ఆధారంగా చేసుకొనే వీరు కావ్య లక్షణాలను వివేచించారు. అంతే కాని వీరు ప్రత్యేకించి కావ్య లక్షణాలను వివేచించినవారు కాదు. ఈ అలంకారశాస్త్రాన్ని మనం ఇప్పుడు ప్రాచీన భారతీయ సాహిత్య విమర్శ అంటున్నాం.


ఈ అలంకార శాస్త్రాలను రచించిన ప్రసిద్ధ భారతీయ ఆలంకారికులను, వారి అలంకార శాస్త్ర గ్రంథాలను కొన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను.

  • భరతుడు (క్రీ.పూ 600-700) >నాట్యశాస్త్రం
  • అగ్నిపురాణకర్త >అగ్నిపురాణం
  • భట్టి>భట్టికావ్యం
  • భామహుడు (క్రీ. శ. 7వ శ)> కావ్యాలంకారః
  • దండి (క్రీ. శ. 7వ )> కావ్యాదరః
  • ఉద్భటుడు( క్రీ. శ. 779-813) >కావ్యాలంకార సంగ్రహం
  • వామనుడు (క్రీ. శ. 779-813)> కావ్యాలంకార సూత్రవృత్తి
  • ఆనందవర్ధనుడు (క్రీ. శ. 840-870) >ధ్యన్యాలోకం
  • రాజశేఖరుడు (క్రీ.శ. 870-950)>కావ్యమీమాంస
  • భట్టనాయకుడు (క్రీ. శ. 900-1000 )>హృదయతర్పణం
  • కుంతకుడు (క్రీ. శ. 950-1050) >వక్రోక్తి జీవితం
  • భట్టతౌతుడు (క్రీ. శ. 950-980 )>కావ్యకౌతుకం
  • రుద్రటుడు (క్రీ. శ. 8,9 శతాబ్దాల మధ్య) >కావ్యాలంకారః
  • క్షేమేద్రుడు (క్రీ. శ. 1000-1063 )>ఔచిత్యవిచారచర్చ
  • భోజుడు క్రీ. శ. (1010-1055 )>సరస్వతీకంఠాభరణం
  • మమ్మటుడు (క్రీ. శ. 1010-1101) >కావ్యప్రకాశము
  • మహిమభట్టు (క్రీ. శ. 1020-1060) >వ్యక్తివివేకం
  • ధనుంజయుడు (క్రీ. శ. 10వ శ ;మ.భా) >దశరూపకం
  • రుయ్యకుడు (క్రీ. శ. 1135-1150) >అలంకార సర్వస్వం
  • హేమచంద్రుడు (క్రీ. శ. 1150-1172) >కావ్యానుశాసనం
  • జయదేవుడు (క్రీ. శ. 1200-1250) >చంద్రాలోకము
  • విశ్వనాథుడు (క్రీ. శ. 1300-1380 )>సాహిత్యదర్పణం
  • విద్యానాథుడు (క్రీ. శ. 14వ )>ప్రతాపరుద్రయశోభూశణం
  • విద్యాధరుడు (క్రీ. శ. 14వ) >ఏకావళి
  • భానుదత్తుడు (క్రీ. శ. 14వ) >రసమంజరి వారణాసి
  • రూపగోస్వామి (క్రీ. శ. 1470-1554) >భక్తిరసామృత సింధువు
  • అయ్యప్పదీక్షీతిడు (క్రీ. శ. 1554-1626) >కువలయానందకరము
  • జగన్నాథ పండితరాయలు (క్రీ. శ. 17వ) >శతాబ్దం రసగంగాధరము
  • విన్నకోటపెద్దన >కావ్యాలంకార చూడామని
  • రామరాజభూషనుడు> కావ్యాలంకార సంగ్రహం
  • చర్లగణపతిశాస్త్రి >సాహిత్య సౌందర్య దర్శనము
  • పింగళి లక్షీకాంతం >సాహిత్య శిల్ప సమీక్ష

*అయితే వీరి కాలాలను నిర్ణయించడంలో విమర్శకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఈ అలంకారశాస్త్ర గ్రంథాలలో కావ్య నిర్వచనాలు, కావ్యాత్మ, కావ్య హేతువులు, కావ్య స్వభావం, కావ్య భేదాలు, నాయిక, నాయక లక్షణాలు,రసం, ధ్వని, అలంకారాలు, ఔచిత్యం, రీతులు, వక్రోక్తి,నాటక లక్షణాలు మొ.వి చర్చనీయాంశాలుగా ఉన్నాయి.

No comments: