Sunday, January 28, 2007

సాలీడు

ఆధునిక తెలుగు కవిత్వంలో గుర్రం జాషువా విశిష్టమైన కవి. జాషువా (1895-1971) సమాజంలో అట్టడుగు వర్గంలో జన్మించాడు.అందువల్ల అతడు బాల్యంనుండి సమాజంలోని కులాహంకారం వల్ల ఎదుర్కొన్న తిరస్కారాలు,అవమానాలు,ఈసడింపుల వల్ల ఆయన మిగితా కవులకన్నా భిన్నంగా తన స్వీయానుభవ జనిత భావావేశంతో విలక్షణమైన పద్ధతిలో కవిత్వం రాసాడు.సామాజంలోని ఉన్న ఈ తిరస్కృతి వలననే అతడు ప్రత్యేకంగా ప్రతిస్పందించటానికి కారనాలైనాయి అని చెప్పవచ్చు.

ఖండకావ్య ప్రక్రియలో జాషువాగారికి ప్రత్యేక స్థానం ఉంది.ఈ ప్రక్రియ భావకవిత్వం తర్వాత తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించింది.ఆంగ్ల నాగరికత సంపర్కం వల్ల ప్రజల జీవన విధానంలో అంతకుముందెన్నడు లేని మార్పు వచ్చింది.చైతన్యం ఉరకలెత్తింది.తక్కువ కాలంలో ఎక్కువ ఆనందం ఇచ్చే కవిత్వం కావలసి వచ్చింది. ఈ పరిస్థితుల కారణంగా నవ్యకవిత్వంలో ఈ ప్రక్రియ ప్రథమగణ్యమైంది.

ఖండకావ్యాలను గురించి మొదటిసారిగా పేర్కొన్న లాక్షణికుడు విశ్వనాథుడు ఈయన వాక్యం రసాత్మకం కావ్యం వాక్యం అంటే కేవలం పదాల కూర్పు కాదు ప్రతి పదం రసాత్మకంగా ఉండాలని చెప్పాడు.అదే విధంగా ఖండకావ్యంలోని ప్రతి పద్యం కూడా రసాత్మకంగా ఉంటుంది.


ఆధునిక కవులలో విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలగు కవులు ఖండకావ్యాన్ని నిర్వచించారు.

విశ్వనాథ సత్యనారాయణ :- మహాకావ్యంలో ఏక దేశములైన రసవత్ సంఘటనలుగాని,నగరార్ణవ శైలర్తు విశయాదులలో ఏదైనా ఒకటిగాని తీసుకొని రసభావబందురములైన రమణీయ రచనలు చేస్తే అది ఖండకావ్యం అవుతుంది అని నిర్వచించాడు.

సినారె :- ఒక చిన్నకథ,పరిమిత పద్యాలు,కొన్ని పాత్రలు ఉండి, ఆశ్వాస విభజన లేకుండా రచించిన కొన్ని పద్యాలు లేదా ఒక పద్యం ఖండకావ్యం అవుతుందని నిర్వచించాడు.

ఖండకావ్య రచనలు చేయడంలో జాషువా గారిది అందెవేసినచేయి.ఈయన రాసిన
ఖండకావ్యాలలో సాలీడు చాలా ప్రసిద్ధి చెందింది.ఇందులో సాలీడు జీవన విధానం గురించి మనకు కవి తెలియజేస్తాడు. ఇవి ఐదు పద్యాలైనా జాషువాగారి కవితా వైశిష్ట్యానికి నిదర్శనంగా ఉంటాయి.

సమాజంలో (లోకంలో) చెడ్డగా రుఢికెక్కిన వస్తువుల్లో (ప్రాణుల్లో) మంచిని చూపించడం ఈయన ప్రత్యేకత.లోకంలో సాలీడు కు మంచి పేరు లేదు.సాలీడుకు తన గూడును (అల్లిక) నిర్మించుకోవడంలో మంచి నేర్పు ఉంది.ఈ అల్లికను చూసి ఆకర్షించబడి వచ్చిన పురుగుల్ని తన ఆహారం కోసం వాటిని అల్లికలో బంధించి తినేస్తుంది. జాషువా ఈ సాలీడు లోని మోసపూరిత గుణాన్ని కాక దాని అల్లికలోని గొప్పతనాన్ని పొగుడుతు ఈ పద్యాలు రచించాడు.
సాలీడు

నీలోనూలు తయారుచేయు మరగానీ,ప్రత్తి రాట్నంబుగా
నీ,లే;దీశ్వరశక్తి నీకడుపులోనేలీనమై యుండునో
యే లీలన్ రచియింతు వీ జిలుగు నూలీపట్టు పుట్టంబు! ల
సాలీడా;నిను మోసగాడవని విశ్వంబేల ఘోషించెడిన్?
ఢక్కామల్లు పసందునేతపని వాండ్రా,నీ యుపాధ్యాయు లి
ప్డొక్కండున్ గనరాడు డాగుకొనినారో నీదుగర్భంబునం ?
దిక్కాలంబున నన్నుమించు పనివాడే లేడు;దుర్వృత్తికిన్
దిక్కై,నీయసమాన కౌశలము వ్తర్థీబూతమై పోయెడిన్
పురువుం గుంపును మోసపుచ్చుటకు గాబోల్దొంగ మగ్గాలపై
మురిపెంబని యుల్లిపట్టు వలిపంబుల్నేసి,నీ మందిరాం
తర దేశంబున నారగట్టి యొక పొంతం బొంచినా వోరిట
క్కరి సాలీడవుగావు,దొంగవని వక్కాణింపవే లోకముల్

తలపంబున్నమ నాటి వెన్నెలల దిద్దంజాలు నీ నూలు పో
గుల సింగారముజూడవచ్చి యసువుల్గోపోయెడిన్ బ్రాణులో
తులువా!నెత్తురు ద్రావునేత పనులెందుజూడ;మోరంత ప్ర
ద్దులు నీకీ యుదరంభరిత్వమనుకొందుం బెండ్లమున్ బిడ్డలున్

ఒక పర్యాయము కాందిశీకుడగు వీరోత్తంసమొక్కండు కొం
డకు నీవల్లి గూటియందొదిగి యుండన్,దాయలే తెరచి నీ
మొక మాటంబున నమ్మినీదు నిలయంబున్ దొంగియుంజూడ;రం
దుకు నిన్నుంగొనియాడి యీశ్వరుని వైదుష్యంబు నూహించెదన్.
ఈ విధంగా జాషువా సాలీడులోని నేర్పు,నైపుణ్యాన్ని గురించి చాలా ఆత్మీయ దృక్పథంతో వర్ణించాడు.

No comments: